Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, October 10, 2013

నిర్గమకాండము 20

Exo 20:1  దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
Exo 20:2  నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పిం చితిని;
Exo 20:3  నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
Exo 20:4  పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
Exo 20:5  ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు
Exo 20:6  నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను.
Exo 20:7  నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.
Exo 20:8  విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.
Exo 20:9  ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని అంతయు చేయవలెను
Exo 20:10  ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.
Exo 20:11  ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
Exo 20:12  నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
Exo 20:13  నరహత్య చేయకూడదు.
Exo 20:14  వ్యభిచరింపకూడదు.
Exo 20:15  దొంగిలకూడదు.
Exo 20:16  నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
Exo 20:17  నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను.
Exo 20:18  ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి
Exo 20:19  నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము
Exo 20:20  అందుకు మోషేభయపడకుడి; మిమ్ము పరీక్షించుట కును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలు గుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను.
Exo 20:21  ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా
Exo 20:22  యెహోవా మోషేతో ఇట్లనెనుఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుమునేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి.
Exo 20:23  మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు.
Exo 20:24  మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధానబలులను నీ గొఱ్ఱలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వ దించెదను.
Exo 20:25  నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు; దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన యెడల అది అపవిత్రమగును.
Exo 20:26  మరియు నా బలిపీఠముమీద నీ దిగంబరత్వము కనబడక యుండునట్లు మెట్లమీదుగా దానిని ఎక్క కూడదు.

No comments:

Post a Comment